Tuesday 8 September 2015

అందమైన పాదాల కొసం...


చాలామందిలో పాదాల చర్మం దళసరిగా మారి మంట, దురద పుడుతుంటుంది. అంతేకాకుండా చర్మం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి పగుళ్లు ఏర్పడుతుంటాయి. కొన్నిసార్లు వాటి నుంచి రక్తం కూడా కారుతుంటుంది. ఈ సమస్యకి రకరకాల కారణాలున్నాయి. పోషకాహార లోపం, ఎక్కువసేపు నిలబడి ఉండడం, ఎక్సిమా, సొరియాసిస్‌, మధుమేహం, థైరాయిడ్‌ వంటి వాటి వల్ల కూడా పాదాల పగళ్లు అధికమవుతాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడ్డానికి సులభమైన పద్ధతులు చాలా ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని...

  • గుప్పెడు బియాన్ని కొబ్బరి నీటిలో పగలంతా నానబెట్టి రాత్రిపూట మెత్తగా రుబ్బుకోవాలి. పడుకునేముందు పాదాలను వేడి నీటితో శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి. రుబ్బిన పేస్టు రాసి మెత్తని వస్త్రాన్ని చుట్టుకొని పడుకోవాలి. పొద్దున్నే లేచిన తరువాత గోరువెచ్చని నీటితో పాదాలను కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే కాళ్ల పగుళ్లు దూరమవుతాయి.
  • ఇంట్లో వాడుకునే ఏ వంటనూనైనా పాదాల పగుళ్లకు చికిత్సగా వాడుకోవచ్చు. పాదాలను సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడి వస్త్రంతో తుడవాలి. తరువాత వంటనూనెను బాగా పట్టించి కాటన్‌ సాక్స్‌ తొడుక్కోవాలి. పొద్దున్నే వేడి నీటితో పాదాలు కడుక్కోవాలి. ఇలా కొన్ని రోజులపాటు చేస్తే పాదాల పగుళ్లుపోయి నున్నగా తయారవుతాయి.
  • దోసెడు బియ్యం పిండిలో తగినంత తేనె, కొద్దిగా యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌, కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ వేసి పేస్టులా కలుపుకోవాలి. వేడినీటితో పాదాలను శుభ్రంచేసుకున్న తరువాత మిశ్రమాన్ని పాదాలకు, మడమలకు రాసుకొని కొద్దిసేపు రుద్దాలి. ఈ పద్ధతిని కొన్ని రోజులపాటు పాటిస్త్తే పాదాల పగుళ్లు మాయమవుతాయి.
  • వేపాకుల్లో కొద్దిగా నీళ్లుపోసి పేస్టు చేసుకోవాలి. దానిలో మూడు టీస్పూన్లు పసుపు కలిపి పగిలిన పాదాలు, మడమలపై బాగా పూయాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కొని పొడి వస్త్రంతో తుడుచుకోవాలి.
  • రోజ్‌ వాటర్‌, గ్లిజరిన్‌లను సమభాగాలుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునేముందు మడమలకు, పాదాలకు రాసుకొని కొద్దిసేపు మర్దనా చేసుకోవాలి. ఇలాచేస్తే కొన్నిరోజుల్లో పగుళ్లుపోయి పాదాలు మెత్తగా అవుతాయి.

No comments:

Post a Comment