Sunday, 13 September 2015

అదుపు తప్పిన లారీతో 19 మంది బతుకు సమాధి

మరో ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం నుంచి వరుస దుర్ఘటనల గురించి వింటున్న సంగతి తెలిసిందే. తాజాగా భారీ దుర్ఘటనకు ఏపీ వేదిక అయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలోని గండేపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి మృత్యువాత పడగా.. 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇంత భారీగా మృతుల సంఖ్య ఉండటానికి కారణం.. ప్రమాదానికి గురైన లారీలో కూలీ పనికి వెళ్లి వస్తున్న కూలీలు ఉండటమే. అదుపు తప్పి లారీ బోల్తా పడిన ఘటనలో.. పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి లారీలో  సిమెంట్ బూడిదను విశాఖకు బయలుదేరింది. ఇక.. రాత్రి పదకొండు గంటల సమయంలో ఏలూరు బైపాస్ వద్ద బూడిద లారీలో 35 మంది కూలీలు ఎక్కారు. వలస కూలీలు కావటం.. రాత్రివేళలో తమ గమ్యస్థానాలు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉండకపోవటంతో లారీలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారు.

అలా లారీ ఎక్కిన వారంతా తూర్పుగోదావరి జిల్లా కత్తిపాడు.. తొండంగి.. అన్నవరం ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. 19రోజుల క్రితం కూలీ పనుల నిమిత్తం చింతలపూడి వెళ్లిన వారు.. ఏలూరు వరకు బస్సులో వచ్చారు. అక్కడ నుంచి తమ గమ్యస్థానానికి చేరుకోవటానికి లారీని ఆశ్రయించారు. అయితే.. ఈ లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో 35 మంది కూలీలు చిక్కుకుపోయారు. ప్రమాదానికి కారణంగా మితిమీరిన వేగంతో లారీని నడపటంగా భావిస్తున్నారు.

ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్.. క్లీనర్ పారిపోయారని భావిస్తున్నారు. ప్రమాదం వార్త విన్న వెంటనే స్పందించిన అధికారులు మృతదేహాల్ని వెలికి తీసే పనిలో పడ్డారు. ఈ ఘోర ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. మరో 16 మంది తీవ్ర గాయాలు అయినట్లుగా భావిస్తున్నారు. గాయపడ్డ వారిని రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా ప్రయాణికుల్ని లారీలో ఎక్కించుకోవటం.. మితిమీరిన వేగంతోనూ ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకరి నిర్లక్ష్యం 19 మంది  కుటుంబాల జీవితాల్ని సమూలంగా మార్చేసింది.

No comments:

Post a Comment