రాజమౌళి `బాహుబలి2` కోసం కొత్త సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకొనే పనిలో ఉన్నాడా? ఇప్పటిదాకా రాజమౌళి సినిమాలకి సంగీతం అందిస్తూ వచ్చిన కీరవాణి స్థానాన్ని ఇక నుంచి ఎ.ఆర్.రెహ్ మాన్ భర్తీ చేయనున్నాడా? ఫిల్మ్ నగర్ లో అవునన్నట్టుగానే ప్రచారమే సాగుతోంది. కీరవాణి 2016లో రిటైర్ మెంట్ ఎవ్వబోతున్నాడన్న విషయం తెలిసిందే. ఇదివరకు ఆయన స్వయంగా ప్రకటించారు కూడా. అయితే `బాహుబలి 2` కూడా 2016లోనే విడుదలవుతుందని చెప్పారు కాబట్టి ఆ సినిమా పూర్తయ్యాకే కీరవాణి తన రిటైర్ మెంట్ ని ప్రకటించొచ్చని ఊహించారంతా. అయితే `బాహుబలి` ఘన విజయం సాధించడంతో ఆ చిత్రానికి సీక్వెల్ గా రానున్న `బాహుబలి2`పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మరింత భారీ బడ్జెట్ తో `బాహుబలి`కంటే ఘనంగా తీయాలని ఇప్పుడు కసరత్తులు చేస్తున్నారు. చూస్తుంటే `బాహుబలి`లాగే రెండో సినిమా విడుదలవ్వడానికి కూడా తక్కువలో తక్కువ రెండేళ్లు పట్టొచ్చని తెలుస్తోంది.
మరోపక్క కీరవాణి మాత్రం తాను తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడే ఉంటాననని 2016లో తాను రిటైర్ మెంట్ ప్రకటించాల్సిందే అని అంటున్నాడట. అందుకే ఆయన స్థానంలో మరో సంగీత దర్శకుడిని ఎంపిక చేసుకోవాలని రాజమౌళి డిసైడైనట్టు తెలుస్తోంది. అయితే ఆమధ్య కీరవాణి స్థానాన్ని ఆయన తమ్ముడు కళ్యాణ్ కోడూరి భర్తీ చేస్తాడేమో అని మాట్లాడుకొన్నారు. కానీ ఇప్పుడు మాత్రం రాజమౌళి రెహ్ మాన్ పైనే మొగ్గు చూపుతున్నాడని తెలుస్తోంది. `బాహుబలి 2`కి సంబంధించి పాటల్ని కీరవాణి ఇవ్వొచ్చనీ రీరికార్డింగ్ మాత్రం రెహ్మాన్ చేయొచ్చని తెలుస్తోంది. మరి అసలు నిర్ణయమేంటన్నది రాజమౌళి నోరు విప్పితే కానీ తెలిసే అవకాశం లేదు. అయితే `ఓకే బంగారం` ప్రమోషన్స్ లో భాగంగా ఆమధ్య రెహ్ మాన్ హైదరాబాద్ కి వచ్చినప్పుడు రాజమౌళి స్వయంగా వెళ్లి ఆయన్ని కలిసి గంటసేపు మంతనాలు జరిపారు. దూరదృష్టితో ఆలోచించే రాజమౌళి అప్పట్లో రెహ్ మాన్ తో మంతనాలు జరిపాడనీ `బాహుబలి2`కి కచ్చితంగా రెహ్ మానే సంగీత దర్శకుడని కొద్దిమంది బల్లగుద్ది మరీ చెబుతున్నారు. `బాహుబలి2` అక్టోబరులో మొదలవుతుంది కాబట్టి అసలు విషయమేంటన్నది మరికొద్దిరోజుల్లోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
No comments:
Post a Comment