Saturday 12 September 2015

వన్నెలద్దే తులసి..

ఆరోగ్యానికి పెన్నిధి తులసి. ముఖ్యంగా తులసి ఆకులతో అందానికి వన్నె తీసుకురావచ్చు. తులసి ఆకులతో అతి సులువగా ఫేస్‌ ప్యాక్స్‌ తయారు చేసుకోవచ్చు. ఇవి చక్కటి ముఖకాంతితో పాటు మంచి రిఫ్రె‌ష్‌మెంట్‌ను ఇస్తాయి. ఇంతకీ తులసితో ఫేస్‌ప్యాక్స్‌ ఎలా తయారు చేయాలో తెల్సుకుందాం.
 
1. తులసి, పెరుగు.. 
తాజా తులసి ఆకుల్ని తీసుకుని ఇంటిలోపల నాలుగైదు రోజులు ఆరబెట్టాలి. ఆ తర్వాత తులసి ఆకుల్ని గ్రైండ్‌ చేసి పౌడర్‌ చేసుకోవాలి. ఆ తులసి పౌడర్‌ను తీసుకుని దానికి తగినంత పెరుగు కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత ఫేస్‌వాష్‌ చేసుకోవాలి. దీని వల్ల పొడిబారిన చర్మం మృదువుగా మారుతుంది. దీంతో పాటు మృతకణాలు తొలగిపోతాయి.
 
2. తులసి, శెనగపిండి..
గుప్పెడు తులసి ఆకుల్ని తీసుకుని నీటితో మెత్తగా చూర్ణం చేయాలి. ఆ తర్వాత ఆ చూర్ణంలో కాసింత శెనగపిండి, మూడు చుక్కల తేనెను కలపాలి. ఆ మిశ్రమాన్ని కలిపి ముఖానికి పట్టించుకుని పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరచాలి. ఈ ఫేస్‌ ప్యాక్‌ వల్ల ముఖానికి కూలింగ్‌ ఎఫెక్ట్‌ వస్తుంది.
 
3. తులసి, వేప..
తులసి, వేప ఆకుల్ని సమంగా తీసుకుని పేస్ట్‌ చేయాలి. ఈ పేస్ట్‌ కళ్లల్లో పడకుండా ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో శుభ్రపరుచుకుంటే నొప్పులతో పాటు ముఖంపై ఉండే స్పాట్స్‌ తొలగిపోతాయి.
 
4. తులసి ఆకుల చూర్ణానికి పాలతో పాటు ఓట్‌మీల్‌ కలిపి తయారు చేసిన ఫేస్‌ప్యాక్‌ ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత ముఖాన్ని శుభ్రపరచాలి. నాలుగైదు వారాల్లో ముఖ చర్మం మృదువుగా తయారవుతుంది.
 
5. ఒక బౌల్‌లో రెండు స్పూన్ల తులసి పౌడర్‌ తీసుకుని అందులో ఒక టీ స్పూన్‌ ముల్తాన్‌ మట్టి కలపాలి. వీటికి కొంచెం పసుపు, రెండు చుక్కల ఆలివ్‌ ఆయిల్‌, రోజ్‌వాటర్‌ కలిపి ఈ మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మంచినీళ్లతో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తుంటే చర్మంలో ఫ్రెష్‌నెస్‌ వస్తుంది.

No comments:

Post a Comment